Wednesday, August 30, 2006

సత్యము మిమ్ము ముక్తులను చేయును

వీరబల్లెకూ పక్కనున్న వంగిమళ్ళకూ రెండు మైళ్ళ దూరం, మధ్యలో రెండేర్లు అడ్డం.
జనాలు వీటిని యీరబల్లేరు [అసలు పేరు మాండవ్యనది], వొంగిమాళ్లేరు అని పిలుస్తారు.
వంగిమళ్ళలో సరైన బడి లేకపోవడంతో పిల్లోళ్లంతా వీరబల్లెకు రోజూ నడిచి వొచ్చిపొయ్యేవాళ్ళు.
అలా కష్టపడి పైకొచ్చినవాళ్ళు చాలామంది ఉన్నారు వంగిమళ్ళనుంచి.

అప్పుడు నేను ఐదో తరగతి.ఆ చుట్టుపక్కల బాగా పేరు పొందిన శ్రీ శ్రీనివాసా కాన్వెంట్లో.
వంగిమళ్ళ నుంచి మా చిన్నమ్మ కొడుకు మస్తాన్ రెడ్డి [ఒకటో తరగతి అప్పుడు] రోజూ నడవడం కస్టమని మా ఇంట్లోనే ఉండి బడికి పొయ్యేవాడు.
ఒక సారి శెలవు రోజుల్లో నేను నా ఐదో తరగతి మిత్రులతో పాటు మస్తాన్ రెడ్డి వాళ్ళింటికిబోయినా.
వాపసు వొచ్చేరోజు పొద్దున్నే మస్తాన్ రెడ్డికి రెండు నెలల కాన్వెంటు ఫీజుకని వాళ్ళమ్మ ఒక యాభై రూపాయల నోటు నా చేతికిచ్చింది.
ఆ యాభయ్యి నేను చెడ్డీ జెబులో పెట్టుకొని ఆదరా బాదరా మిగతా పిల్లకాయలతో పాటు బడికి బయల్దేరినా.

*** *** ***

మరి, వంగిమళ్ళ పిల్లకాయలంతా ఉండారిప్పుడు...ఆడపిల్లలు కూడా.
వొంగిమాళ్లేట్లో నీళ్ళకన్నా యిసకే ఎక్కువగా ఉంది.
మన ప్రత్యేకత చూపడానికిది మంచి అదును అని పల్టీలు మొదలుబెట్టినా అడ్డంగా నిలువుగా.

*** *** ***

మా నాయన నాకు కొన్ని యోగాసనాలు నేర్పించినాడు.
పెద్దోళ్ళకు కష్టమనిపించే ఆసనాలు కొన్ని నేను సులభంగా చేసేవాణ్ణి.
వీటితో పాటు నాకు అడ్డ పల్టీలు నిలివు పల్టీలు కూడా వచ్చు.
అందువలన(చేత!) నాకొక ప్రత్యేకత ఉండేది నా తోటి పిల్లకాయల్లోగానీ పెద్దోళ్ళల్లోగానీ.

అందరమూ విచ్చలవిడిగా ఆడుకుంటూ యేరు దాటగానే...
నాకేదో గుర్తొచ్చి జేబులో చెయ్యిబెడితే...యాభైలేదు. కొంచం దడ.
"ఇదిగాదులే, ఈ జేబయుంటుందని యడంజేబులో చెయ్యిబెడితే యిసకే ఉంది తప్ప ఇంకేం లేదు.
చొక్కా జేబు కూడ అట్నే యెక్కిరించింది.

*** *** ***

యాభై రూపాయలంటే చానా పెద్ద సంగతి.
శనివారంపూట సంతకుబోతే కూరగాయలు, మా అవ్వకు వక్కాకు, తాతకు బీడీలు అన్నీ పది రూపాయల్లోనే సరిపోయేవప్పుడు.
మా కాన్వెంటు ఫీజు నెలకు ఇరవై రూపాయలుండేది. అది కట్టలేక ఎండలొ నిలబడే విద్యార్థులు ఉండేవాళ్ళు.
మా పరిస్థితీ అదే అయినా, ఆ కాన్వెంటు మా బంధువులదే కాబట్టియును, నేను బాగానే చదువుచుండుట చేతనూ ఎండలో నిలబడిన గుర్తు లేదు నాకు.
ఆ మధ్యనే ఇంకో ఐదు రుపాయలు పెంచినారు. కాబట్టి యాభై రూపాయలంటే పేధ్ధ మొత్తమన్నమాట.

*** *** ***

కొంచం భయంగా, మరికొంచం గందరగోళంగా ఆ యేట్లో యనక్కి పోయి భూగోళం అంతా వెదికినా నోటు మాత్రం కనపరాలా.
"యింగేంజెయ్యాలబ్బా?" అని తలకాయబట్టుకోని కూసుంటే మన ప్రతిభయును మరియు ప్రత్యేకతయునూ [ద్వంద్వసమాసము] అంతా యేటిపాలేగదా!
కాబట్టి వొచ్చిన దారిబట్టి అనాటి పిల్లమిత్రుని తోడుబెట్టుకోని తిరిగి వొంగిమళ్ళకు చేరుకున్నాము.
విషయం అర్థం చేసుకొని "ఏం ఫరవాలేదులే" అని ఇంకో యాభై చేతికిచ్చి పంపించినారు.

*** *** ***


ఇంతా జేసి బడికి ఆలస్యంగా చేరుకొన్నాము. ఆ సంగతి ఇంట్లో తెలీకముందే మనమే చెప్పెయ్యాల. మనకున్న మంచిపేరు అట్టేవుండాల.
ఇంట్లో "యెందుకాలస్యమైంది?" అంటే జరిగిన విషయం చెప్పడానికి అదేమన్నా పెద్ద ఘనకార్యమా?
కాబట్టి ఒక ఉత్కంఠభరితమైన కథ అల్లి చెప్పేసినా.

ఆ కథలో నేను, నా పిల్ల మిత్రులు "యాభై దొరికిందా" అని అందరినీ అడుగుతూ ఉంటాం.
మా కన్నా బలవంతుడైన పిల్లోడొకడు కొంచం అనుమానంగా సమాధానం చెబుతాడు.
నాకు వెంఠనే అవమానంవేస్తుంది(బుడుగు భాషలో అనుమానం వస్తుంది) ... "వీడే దొంగ" అని.
పిల్ల మిత్రులు దొంగను తరుముతుండగా నేను అందరికంటే వేగంగా పరిగెత్తి యాపచెట్టు పక్కన దాంకొని కాలు అడ్డంబెట్టి దొంగను పడేసి వాని జేబులో వెదికి, నా యాభై తీసుకొని, వాణ్ణి నా పిల్లమిత్రులంతా కలిసి కొట్టబోతే వారించి క్షమించి వదిలేసి, "ఉత్తమపురుష" బిరుదాంకితుఁడనై వెలిగిపోతానన్నమాట.

ఇంత గొప్ప కథనం ఉన్న ఈ నా వీరగాథ అనతికాలంలోనే మా అమ్మమ్మ ఊరికి కూడా చేరింది. కొన్ని రోజులు గడిచినాయి.

*** *** ***

వీరగాథ చెప్పడం వరకూ బానేవుందిగానీ,పునాది లేకుండా అప్పటికప్పుడు అట్లా నిర్మించిన ఈ అద్దాల కధాసౌధం యెప్పుడైనా పగలొచ్చని ఒకటే దిగులు.
ఎందుకంటే నాకో మంచిపేరు, మర్యాద, ఒక వ్యక్తిత్వం, గౌరవం, రామూ మంచి బాలుడు లాంటివి కొన్ని సంపాదించుకొన్నాను గనక.
ఇయ్యన్నీ ఈ దెబ్బతో పోతాయేమోనని దిగులు.

వొగరోజు నేను మా యిసక్కయ్యలో వుండే పెద్దబేనీషా చెట్టుమిందెక్కి కూసోనుంటే మా గోపీగాడు మహా వుషారుగా నన్నెతుక్కుంటా వచ్చి --
"అన్నా, నువ్వొగ సంగతిజెప్పాల. నాయనా నేనూ వొగ రూపాయ్ పందెమేస్కున్యాం. నువ్వా యావైరూపాయల్నోటు వాణ్ణెవుణ్ణో తరిమి పట్టి తెచ్చినావా, ల్యాపోతే వొంగిమాళ్ల నించీ తెచ్చినావా"
కండ్లు తిరిగినట్టనిపించింది. మామిడిచెట్టు నుంచీ పడిపోతానేమో అని కొమ్మ గెట్టిగా పట్టుకోని మొదిట్లోకి దిగి, తన్నుకొచ్చే ఏడుపునాపుకొనే ప్రయత్నం చేస్తూ --
"నేన్జెప్పిందంతా ఆపద్దమే. ఐతే ఇప్పుడు ఈ సంగతి అమ్మానాయన్లకు తెలిసిపొయ్యింది. ఇంగ నన్ను నమ్మరు. ఈరోజునించి నేనేంజెప్పినా అంతే..." అంటూండంగా యేడుపాగలా.
ఏదో వొగ రూపాయ వస్తుందిగదా అనుకోనొచ్చిన మా గోపీకి గందరగోళం. నా ఏడుపుకు జాలిపడి నామొగంలోకి చూస్తూ నాపక్కనే వొచ్చి కూసోని మూగ సానుభూతీ మద్దతూ ప్రకటించినాడు.
విషయమంతా తెలిసినా, నా అహానికి పెద్దగా దెబ్బ పడకుండా, నాతో నిజం చెప్పించేందుకు ఈ రూపాయ్ పందెం అని అర్థమైంది. ఇది సిగ్గువిడిచి తప్పు ఒప్పుకోవలసిన సమయం.
నేను పడే ఈ రదన అర్థంచేసుకున్న అమ్మానాయనా నన్ను మాట్లాడించి తప్పు నా నోటితో ఒప్పించే ప్రయత్నాలేవీ చేయలేదు.
తలెత్తి చూడలేని నా మనఃస్థితి, కదిలిస్తే యేడ్చేట్లుండే నా మొగము చూసి, గోపీకి రూపాయినిచ్చి మా నాయన ఓటమినంగీకరించినాడు.
ఆయన మాటమీద మా అమ్మ ఇంకో రూపాయి తెచ్చి - ఇది నీకు - అని నా చేతిలో పెట్టింది.

*** *** ***
అబద్ధం చెప్పడం వల్ల మోయవలసివచ్చిన కొండంత బాధ భారం నుండి సత్యం నన్ను ముక్తుణ్ణి చేసింది.
ఆ రోజు నుండి నేనేవిషయాన్నీ ఇంట్లో చెప్పకుండా దాచలేదు. ఈ పద్ధతి వల్ల లాభం - మనశ్శాంతి.
ఒకవేళ ఏదైనా తప్పుచేసినా ఎవరిద్వారానో ఇంట్లో తెలిసే అవకాశం లేదు. మనమే చెప్పేస్తాం. ఇంకెవరికి భయపడాల?

*** *** ***

ఇంతకూ, నేపథ్యంలో జరిగిన కథ ఏమంటే -
నేను చెప్పిన కథతో పుత్రోత్సాహము తండ్రికి కలిగిందో లేదో తెలీదు.
కానీ మా అమ్మమ్మకు మాత్రం పౌత్రోత్సాహము కలిగినట్టుంది (పౌత్రుడంటే మనవడని ఎక్కడో చదివిన గుర్తు), మా వొంగిమాళ్ళచిన్నాయనకే నా వీరగాథ వినిపించి మురిసిపోయింది.
ఆయన నవ్వి ఙ్ఞానబోధ చేసేసినాడు. వేదం ప్రవచించినాడు (వేదం అనగా "తెలిసినది" అని అర్థమంట).
అంతే. ఆకాశవాణి. ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ...

*** *** ***

7 comments:

swathi said...

ఎంత చక్కగా రాశారు.
మీ రచనలో శైలో శిల్పమో అది బాగుంది.
కధలు రాస్తూ ఉండండి
మేము చదవాలని ఎదురు చూస్తూ ఉంటాం.

spandana said...

రెడ్డి గారూ,
మన వూరి యాసలో చాలా బాగా సెప్పినారు.
గాంధీజి బీడీ కాలిసింది వాల్ల నానకు సెప్పి, జానోదయం పొందినట్లు.
వంగిమల్లంటే గుర్తొచ్చింది, మా ముత్తాతలది వంగిమళ్ళే, అట్నుంచి ఇటు వలసొచ్చినారు. చరసాల ఇంటిపేరు గల మా దాయాదులు అక్కడ కూడా వున్నారు. మీగ్గాని తెలుసా?

-- ప్రసాద్
http://charasala.gmail.com

శ్రీనివాసరాజు said...

చాలా బాగుందండీ.. ఒక్కసారి కడప ని మా (ఆఫీసు) గడపకు తీసుకొచ్చి చూపించినట్లుంది.నేనేప్పుడూ కడపకి వెళ్ళలేదు కానీ.. ఆ యాస విన్నా. ఆ యాసలో చెప్పక పోతే.. అంత ఆనందం ఉండేది కాదేమో.. ఇటుంవంటివి ఇంకా వ్రాయాలని ఆశిస్తున్నాను.

cbrao said...

ఈ కథ చెప్పిన తీరు బాగుంది.ఇంకా వైవిధ్యభరితమైన కథలు రాయండి.

kiraN said...

చాలా బాగుంది.
రాము మంచి బాలుడే కాదు మంచి శైలి కూడా ఉంది.

- కిరణ్

chaitü said...

చాలా బాగా చెప్పారండీ... మీరు చెప్పిన విధానం నాకు బాగా నచింది.

ఇలాంటి చిన్న చిన్న సంఘటనలే పెద్ద పెద్ద పాఠాలు నేర్పిస్తాయి...

rambler said...

చాలా బావుంది! మీ ప్రతిభా ప్రత్యేకతలు "అద్వంద్వము" అమేయము.. :)

కాబట్టి ఒక ఉత్కంఠభరితమైన కథ అల్లి చెప్పేసినా.

so! ఈ కథలు చెప్పటం వెన్న తో బెట్టిన విద్య అన్నమాట! హహ్హ!

btw మీరు మాంచి బాపు అభిమాని లా వున్నారే!.. ఆ "మడిసన్నాక.." కొటేషను, బుడుగు రెఫెరెన్సు..

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.