Friday, August 11, 2006

జనులాపుత్రుని కనుగొని పొగడగ

"నేను పాడుకొంటాను" అంటారు ఘంటసాల.
తెల్లవారినంత,కొమ్మ పూసినంత, కోయిల కూసినంత సహజమైన శోభ ఘంటసాల పాటలో ఉంటుంది.

కాదరయ్యపాట కూడా "నేను పాడుకొన్నది".
"పాడాలంటే హృదయం ఊగాలి" అన్నారో సినీకవి.

పెద్దోళ్ళంతా నా చుట్టూ చేరి (అందరూ పెద్దోళ్ళే, ఎందుకంటే నేనప్పుడు చిన్నోణ్ణి) పాడమని మరీమరీ అడిగే వాళ్ళు.
మా అమ్మమ్మగారి ఊళ్ళోఅయితే మరీ ఎక్కువ. సాయంత్రం అందరూ ఊరి మధ్యలో దేవళం దగ్గర చేరేవాళ్ళు.
మరి పాట వినాలంటే కాదరయ్య చిన్ని హృదయం ఊగే వాతావరణం సృష్టించాలి.
ఊగేవరకూ ఓపికపట్టాలి.

కొంత మంది పెద్దోళ్ళు తొందరపెట్టే వాళ్ళు.
హడావిడిగా వీళ్ళను వారించేవాళ్ళు వీళ్ళకన్నా పెద్దోళ్ళు.
తొందరపెడితే కాదరయ్య హృదయం ఊగే అవకాశాలు తగ్గిపోతాయని తెలిసినోళ్ళు వీళ్ళు.

చుట్టూ అభిమానులు. అందరూ వయసులో పెద్దోళ్ళే.
మధ్యలో ఆకర్షణ కేంద్రం కాదరయ్య ఉరఫ్ నేను.

"ఊ..." అనేవాళ్ళు ఒకరు... పాట ప్రారంభానికి ఊతంగా.
"పాడతాడు ఉండండ్రా" -- మిగతావాళ్ళను కసిరినట్టుగా అని నా ప్రాముఖ్యాన్ని పెంచేవాళ్ళు కొందరు.

నిశ్శబ్దం... అందరి చూపులు కాదరయ్య పాట కోసం...

అది అనువైన వాతావరణం అనిపించి, పాట మొదలు పెట్టగానే అందరిలో సంతోషం.
"పల్లె కుక్క భౌమనె కాదరయ్యా వాడు అడ్డదోవబట్టినాడు కాదరయ్యా..." అనగానే ఘొల్లుమని నవ్వులు.
ఇంక అక్కణ్ణుంచి ఒకటే నవ్వులు... "దోవల్ దోవలు ఉరికినాడు కాదరయ్యా" అని మెల్లగా పాట ఆపినంతవరకు.
పాట అయిపోగానే కాదరయ్య పాట్లు గుర్తు చేసుకొని మళ్ళీ నవ్వే వాళ్ళు.

ఆ పెద్దలకు నేనొక అబ్బురం. తరువాత పద్యాలు, శ్లోకాలు... అన్నీ మా నాయన నేర్పినవే.
కొంతమంది నన్ను గట్టిగా పట్టుకొని చెంపమీద ముద్దు పెట్టేవాళ్ళు.
వీళ్ళలో వక్కాకు వేస్కునేవాళ్ళ (తాంబూల చర్వణం చేయువారి) ఎంగిలి ముద్దులు నాకు భలే ఇబ్బంది.
ముద్దు పెట్టగానే వెంటనే కళ్ళు మూసుకొని చెంప గఠ్టిగా తుడుచుకొని వాళ్ళచేతుల్లో నుండి తప్పించుకొని వచ్చేయడం నాకు ఇప్పటికీ గుర్తు.

అంతమందిని అబ్బురపరచదం గొప్ప సంగతి అని తెలియకపొయినా, ఆ వీఐపి మరియాద నాకర్థమయ్యేది.
ఈ కోలాహలం అంతా మా నాయనకు ఇంకెంత ఆనందాన్నిచ్చేదో ఇప్పుడు నేను కొద్దిగా ఊహించగలను.

మా నాయన మాకో పద్యం చెప్పేవాడు:

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

చిన్నప్పుడు ఏ పుత్రుడైనా అప్రయత్నంగానే తండ్రికి ఈ ఉత్సాహాన్ని కలిగిస్తాడు.
మరి పెద్దయినాక!? ప్రయత్నించాల్సి ఉంటుంది. కదా?

7 comments:

చేతన said...

Wow back eith a post again..!!?!! "తెల్లవారినంత,కొమ్మ పూసినంత, కోయిల కూసినంత సహజమైన శోభ...." wonderful!! Keep it going! As chaduvari said, why dont you post audio file of ur kadarayya song on the blog? we all would love to listen to/learn what exactly is that song, which earned so much fame to you and putrotsaham to ur nayana..!

త్రివిక్రమ్ Trivikram said...

తెల్లవారినంత,కొమ్మ పూసినంత, కోయిల కూసినంత సహజమైన శోభ ఘంటసాల పాటలోనే కాదు మీ బ్లాగులో కూడా ఉంది. :) మీ బ్లాగు చదువుతూ ఉంటే చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి.

"మరి పెద్దయినాక!? ప్రయత్నించాల్సి ఉంటుంది. కదా?"
నిజమే కదా?

chaitü said...

baagundi mee pOsT :)

kiraN said...

మరి పెద్దయినాక!? ప్రయత్నించాల్సి ఉంటుంది

meeru eepatiki aa prayatnamlo vijayam saadhinche vuntaru.
avunaa..

- kiraN

సుధాకర్(శోధన) said...

మీరు చాల ధనవంతులు సుమాండీ :-) అద్భుతమైన పద ప్రయోగాలు మీ దగ్గర వున్నాయి..

"ముక్కు పగిలే దాక.." నాకు చాలా నచ్చింది

rambler said...

అబ్బ! ఎంత బావుండాదని... ఒక పక్క రాయలసీమ జనపదాల్తో మరిపిస్తూ, మరొ పక్క పుత్రొత్సహం గురించి సున్నితంగా హితవు పలకడం.. చిన్నొడా... కాదరయ్య.. అదిరింది పో!

Nagaraja said...

మీ బ్లాగు చాలా చాలా బాగుంది. మీ పాట వినాలని ఉంది. త్వరలో అందరి కోరిక తీరుస్తారని భావిస్తూ...

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.